Monday, 10 June 2013

శీర్షిక; రామాయణం లో కథలు :   రచన : నాగాశేష
రావణుని కథ ;(మూలం వాల్మీకి రామాయణం ఉత్తరకాండ )
శ్రీ రామచంద్రుడు దుష్టులైన రాక్షసులను సంహరించిన పిమ్మట అయోధ్య కు మరలి రాజ్యాభిషిక్తుడు  అయ్యాడు ధర్మంగా రాజ్యపాలన చేస్తూ ఉండేవాడు . ఒకనాడు అగస్త్యుడు మొదలగు మహర్షులు శ్రీ రామచంద్రుని దర్శానార్ధం అయోధ్యకు వచ్చారు . వారందరి కి శ్రీ రాముడు అర్ఘ్య పాద్యాదులు  ఇచ్చి ,ఉచిత ఆసనాలు  చూపించాడు.  అగస్త్యడు అప్పుడు  రాముడి తో " రామా  రాక్షస రాజైన రావణుని , అంతకంటే పరాక్రమవంతుడు ,కాలుని వలె వేగము గా విజ్రుం భించుట లో ఆరితేరిన ఇన్ద్రజిత్తుని నీవు లక్ష్మణునితో కలసి సంహరించి నందులకు మేము మిగుల సంతసించి , నిన్ను అభినందించు చున్నాము " అన్నాడు .దానికి శ్రీ రామచంద్రుడు " పూజ్యులైన మహర్షులరా నిశాచారులైన రావణ కుంభకర్ణులు ఇరువురు మహావీరులే కదా  , వారిని కాదని మీరు  ఇంద్రజిత్తుని ఏల ప్రశం శించుచున్నారు ?" అని అడిగాడు . దానికి అగస్త్య మహర్షి శ్రీ రామా తేజో బల  సంపన్నుడైన ఇంద్రజిత్తు వృత్తాంతం వివరిస్తాను విను . దానికి ముందుగా రావణుని వంశక్రమం అతని పుట్టు పూర్వోత్తరాలు అతనికి వరములు లభించిన తీరును వివరిస్తాను  శ్రద్ధగా విను . అని ఇలా వివరించారు.

ఇది కృత యుగం నాటి కథ: పూర్వం పులస్త్యుడు అను బ్రహ్మరిషి ఉండేవాడు . అతడు బ్రహ్మ మానస పుత్రుడు అతడు తండ్రి అంతటి తేజశ్శాలి , ధర్మ నిరతుడు . ఈ పులస్త్యుడు తపశ్చర్యకై  మేరు పర్వతం దగ్గర ఉన్న తృణబిందు మహర్షి యొక్క ఆశ్రమానికి  వెళ్లి అక్కడ వేదములు పఠిస్తు   జితెన్ద్రియుడై తపస్సు చేసుకుంటూ ఉండేవాడు ,అయితే అతడు తపస్సు  చేసుకుంటున్న సమయంలో చాలామంది దేవకన్యలు , నాగకన్యలు రాజర్షి తనయులు అప్సరసలు అక్కడికి వచ్చి క్రీడలు సలుపుతూ , ఆటపాటలతో వాద్యములతో నృత్యములతో వినోదిస్తూ  ఉండేవారు . అవి ముని తపశ్చర్యలకు విఘ్నములు కలిగిస్తూ ఉండేవి . అందుకు ఆ ముని క్రుద్ధుడై " నా దృష్టిలో పడిన కన్య గర్భవతి అగు గాక " అని` కఠొరముగా  శపించాడు . అది విని ఆ కన్యలందరూ ముని దృష్టి లో పడకుండా  ఆప్రదేశం విడిచి వెళ్లి పోయారు . తృణ బిందు మహర్షి కుమార్తె కు మాత్రం ఈ రుషి వాక్కులు వినబడలేదు అమె యధా  ప్రకారం పులస్త్యుని ఆశ్రమంలో విహరించింది  ఇంతలో  వేదాధ్యయనం  చేస్తున్న మునికంట  పడనే పడింది. ముని  శాప మహిమవలన ఆమెలో గర్భవతి లక్షణాలు ఏర్పడ్డాయి . తృణ బిందు మహర్షి తన దివ్య దృష్టి తో అన్ని విషయాలు తెలుసుకొని . ఆమెను పులస్త్యునికి కన్యాదానం చేసాడు .
ఆ విధంగా తృణ బిందు మహర్షి కుమార్తె కు ఒక కుమారుడు జన్మించాడు అతడు "పౌలస్త్యుడు" గా వాసికేక్కాడు  అతడు తల్లి గర్భం లో ఉండగా వేదములను గ్రహించాడు అందుకే అతనికి 'విశ్రవసుడు' అను పేరు వచ్చింది . విశ్రవసుడి భార్య భరద్వాజ మహర్షి కుమార్తె అయిన " దేవవర్ణిని". వారిరిరువురికి కలిగిన పుత్రుడు 'వైశ్రవణుడు ' . అతడు కొన్ని వేల సంవత్సరములు తపశ్సు చేసి బ్రహ్మ అనుగ్రహం తో దిగ్పాలకులలో ఒకడు అయ్యాడు అతడే ధనాధిపతి అయిన కుబేరుడు .బ్రహ్మ అతడికి "పుష్పకము " అను ఒక దివ్యమైన విమానం కూడా ఇచ్చాడు .   తన తండ్రి అయిన విశ్రవసుని తనకు నివాస యోగ్యమైన స్థలం కావాలని అడిగాడు కుబేరుడు . అందుకు విశ్రవసువు "దక్షిణ తీరమున త్రికూటము  అను పర్వతము కలదు ఆ పర్వతము పైన రమ్యమైన లంకా నగరము కలదు , దానిని విశ్వకర్మ పూర్వము రాక్షసులు నివసించుటకై నిర్మించాడు , నీవు అచట నివసించు అక్కడ నీ భద్రత కు ఎట్టి  లోపము వాటిల్లదు అని చెప్పాడు.ఆ విధం గా కుబేరుడు కొన్నే వేల మంది యక్షుల తో లంకలో నివసించా సాగాడు.అని అగస్త్య మహర్షి వివరించగా . శ్రీ రాముడు " మహర్షీ ! లంకలో రాక్షసులు ఎట్లు ఏర్పడిరి , వారి మూల పురుషుడు ఎవరు వారు లంక ను వదిలి ఎందులకు వెళ్ళ  వలసి వచ్చినది "అని అడిగాడు .

మహర్షి రాక్షసుల కథని ఇలా వివరించారు : " బ్రహ్మదేవుడు మొట్ట మొదట జలమును సృష్టించాడు . ఈ జలమును రక్షించడానికి ప్రాణులను సృష్టించాడు . ఆ ప్రాణులతో  ఈ జలమును రక్షిమ్పుడు అన్నాడు . అందులో అధికము గా ఆకలి తో ఉన్నవారు "మేము రక్షిస్తాము అన్నారు" అంతగా ఆకలి లేని వారు మేము జలమును పూజిస్తాము అన్నారు. రక్షించిన వారు రాక్షసులు  పూజించిన వారు యక్షులు అయ్యారు . రాక్షసులలో ముఖ్యులు "హేతి " "ప్రహేతి" అను ఇరువురు సోదరులు . అందులో ప్రహేతి అనువాడు ధార్మికం  గా తపశు  చేసుకొనడానికి అడవులకి వెళ్ళాడు .హేతి యముని సోదరి అయిన భయ ను వివాహమాడి అమెవలన విద్యుత్కెసుడు  అను పుత్రుని కన్నాడు. విద్యుత్కేషుడు సంధ్యా పుత్రిక అయిన " సాలకటంకట" ను వివాహమాడినాడు  కొంత కాలానికి  ఆమె  ఒక మగ శిశువును కన్నది  .వారు ఆ మగ శిశువున మందరగిరి  పై వదలి . వెళ్లి పోయారు . తల్లి చే విడువబడిన ఆ శిశువు మేఘ గర్జన వంటి ధ్వని కలవాడు సూర్యుని వంటి తేజో మూర్తి .తన పిడికిలి ని తన నోటి యందు ఉంచుకొని పెద్దగా ఏడవసాగాడు . అదే సమయం లో అటుగా వృషభ వాహనులై వస్తున్న ఉమా శంకరులు ఆ పిల్లవాడిని చూసి జాలిపడి వానిని యవకుడి గా చేసి వానికి అమరత్వము ఆకాసము నందు సంచరించుటకు ఒక విమానమును ప్రసాదించిరి . ఆ పిల్లవాడు 'సుకేసుని' గా ప్రసిద్ధుడైనాడు .సుకేసుడు దెవవతి  అను గంధర్వ  కన్యను వివాహమాడి ఆమెవలన మాల్యవంతుడు , సుమాలి ,మాలి అను మిగుల బలసాలులు అయిన ముగ్గురు  కుమారులను  పొందాడు . ఆ ముగ్గురు పెరిగి పెద్దవారై తీవ్రమైన నియమములు పాటించుచు ఘోర తపస్సు చేసారు  బ్రహ్మ వారి తపస్సు కు మెచ్చి చిరకాలము జీవిన్చునట్లు , ఎంతటి శత్రువు నైనా జయించి అజేయులు గా నిలుచునట్లు వరమును ప్రసాదించాడు .
వర ప్రభావము చేత ఆ ముగ్గురు అసురులు నిర్భయులై దేవతలను ఋషులను మిగుల బాధించడం మొదలపెట్టారు .ఇలా ఉండగా ఎక్కడా వారికి ఎదురు లేక పోవుట చేత వారు శిల్పులలో అగ్రగణ్యుడు అయిన విశ్వకర్మ దగ్గరకు పోయి మాకు నివాస యోగ్యమైన ఒక భవనము నిర్మించి ఇమ్ము  అని అడిగారు  అంతటా విశ్వకర్మ "సజ్జనులార ! దక్షిణ తీరమున త్రికూటము అను పర్వతము కలదు . ఆ పర్వత శిఖరము పై ఇంద్రుని ఆజ్ఞను అనుసరించి నేను లంకా నగరమును నిర్మించాను అందు మీరు నివశించ వచ్చు " అన్నాడు అరొజు నుండి వేలకొలది రాక్షసులు ద్రుఢమైన ప్రాకారములు అగడ్తల తో ఒప్పుచున్న లంకా నగరం లో నివశించ  సాగిరి.

మాల్యవంతుడు , సుమాలి , మాలి వరుసగా గాంధర్వ కన్యలైన సుందరి, కేతుమతి వసుధ లను  వివాహమాడిరి .
ఈ ముగ్గురు రాక్షసులు పెట్టెడి బాధలను ఓర్చుకొన లేక దేవతలు ,  ఋషులు శంకరుని శరణు జొచ్చారు , కాని శంకరుడు సుకేసుని పై గల ప్రేమ చేత " వారిని నేనుసమ్హరించలెను  మీరు విష్ణువు ని వేడుకోండి అతడు మీ బాధలు తీర్చ గలడు" అన్నాడు . అంతట వారు మహావిష్నువుని శరణు జొచ్చారు . మహావిష్ణువు వారికి అభయమిచ్చి పంపివేసాడు . ఈ విషయం తెలుసుకొన్న మాల్యవంతాది రాక్షసులు సమస్త సైన్యము తో దేవతలపై యుద్ధానికి వేళారు . అంతట  శ్రీమన్నారాయణుడు గరుడ వాహనుడై  దేవతలకు సహాయ పడుటకై వచ్చాడు దెవతలకు రాక్షసులకు ఘోరమైన యుధం జరిగింది శ్రీ మహా విష్ణువు రాక్షస సైన్యం పై విజ్రుమ్భించి మాలినిని తన చక్రము చే సంహరించాడు.  మహావిష్ణువు ధాటికి తట్టుకొనలేక  మాల్యవంతుడు సుమాలి తమ బలములతో లంకకు పరుగులు తీసారు . అంతటి తో ఆగక భయము తో వారు సపరివారముగా లంకను వదిలి  పాతాళ లోకానికి చేరి తల దాచుకొన్నారు .అలా శూన్యమైన లంకను కుబేరుడు తన నివాసం చేసుకొన్నాడు , అని అగస్త్య మహర్షి చెప్పారు .

ఇలా కొంత కాలం గడచిన తరువాత ఒకనాడు  సుమాలి పాతాళ లోకం నుంచి భూలోకానికి వచ్చి సంచరిస్తూ  ఉండగా అతనికి ఆకాశము లో పుష్పక విమానం పై విహరిస్తున్న కుబేరుడు కనిపించాడు .సుమాలి ఆశ్చర్య పడి కుబేరుని వంటి వాడు రాక్షసుల లో కూడా జన్మిస్తే , రాక్షసులు కూడా కుబేరుని వలె వ్రుధి  చెందవచ్చు అనుకున్నాడు .అప్పుడు అతని కుమార్తె కైకసి కూడా అతని వెంట ఉండెడిది  అతడు తన కుమార్తె అయిన కైకసి తో " పుత్రీ !పులస్త్య నందనుడైన విశ్రవసుడు (కుబేరుని తండ్రి) బ్రహ్మ వంశమునకు చెందిన  వాడు ఉదాత్త గుణ సంపన్నుడు , ముని శ్రేష్టుడు అన్ని విధాలా నీకు తగిన వరుడు , నీవు అతనిని సేవిమ్పుము నీకు కూడా కుబేరుని వంటి తేజోవంతుడైన కుమారుడు పుడతాడు అన్నాడు . దానికి ఆమె సమ్మతించి  ఒకనాడు సాయంకాలము విశ్రవసుడు అగ్నికార్యములు నిర్వర్తిస్తున్న సమయం లో అతని వద్దకు వెళ్లి నిలుచున్నది . మహాత్ముడైన విశ్రవసువు ఆమె మనసులోని భావము తెలుసుకొని "నీ మనసులోని భావము తెలిసినది నీవు నావలన పుత్రుని పొందవలేనన్న కోరిక తో వచ్చావు కాని ఇది సంధ్యా సమయము . ఈ సమయము లో నీకు జన్మించెడి తనయులు క్రూరకార్యములకు పాల్పెడెడి రాక్షసులు అగుదురు ,వారి స్వభావములు ఆకారములు భయంకరములు" అని హెచ్చరించాడు . కాని కైకసి పట్టు విడవక " మహాత్మా మీరు వేదవేత్తలు మీ నుంచి ఇట్టి పుత్రులను పొందుట నాకు సమ్మతము కాదు" అన్నది .  అందులకు మునీశ్వరుడు ' "శుభాననా ! నావలన నీకు కలిగెడి  కుమారులలో చివరి వాడు నా వంశమునకు తగినటువంటి ధర్మాత్ముడు కాగలడు" అన్నాడు

కొంత కాలము తరువాత కైకసికి రాక్షస లక్షణములు గల ఒక కొడుకు  పుట్టాడు. అతడు కాటుక కొండ వలె నల్లని  వాడు . అతనికి పది తలలు ఇరవై భుజములు పొడవైన దంతములు గలవు అతడు పుట్టినంతనే నక్కలు తమ ముఖములనుండి అగ్ని జ్వాలలు వేలగ్రక్కినవి. మేఘములు భయంకరముగా గర్జించినవి రక్తవర్షము కురిపించినవి ఉల్కలు రాలినవి సూర్యకాంతులు సన్నగిల్లి భూమి  కంపించినది . పది తలలు ఉన్నందున అతనికి "దశగ్రీవుడు "అని పేరు పెట్టారు . తదనంతరము కైకసి కి పుట్టినవాడు 'కుంభకర్ణుడు' అతడు మహాకాయుడు , అంతటి దెహప్రమాణము కలవారు ఇంకొకరు లేరు . పిమ్మట కైకసి కి వికృతమైన ముఖము కలిగిన 'శూర్పణఖ' అను కుమార్తె కలిగినది . కైకసి యందు కలిగిన ఆఖరివాడు 'విభీషణుడు'అతడు  మిగుల బలశాలి సత్వగుణ సంపన్నుడు . అతడు పుట్టినంతనే  పుష్పవర్షం కురిసింది .

కైకసి పిల్లలు విశ్రవసుని   ఆశ్రమం లో పెరిగి పెద్దవారు  అయ్యారు . వారిలోదశగ్రీవ  కుంభకర్ణులు అతి బలవంతులై దుష్కార్యములు చేస్తూ లోకాలనే భీతిల్ల చేస్తూ ఉండేవారు , విభీషణుడు మాత్రము ధర్మ నిరతుడై నియమ నిష్టలతో వేదాధ్యయనం చేస్తూ ఉండేవాడు . ఒక నాడు ధనాధిపతి అయిన కుబేరుడు తన తండ్రి దర్శనార్ధం పుష్పక విమానం పై అక్కడికి వచ్చాడు.   అగ్నివలె తేజోమూర్తి అయిన  అతనిని చూసి రాక్షసిఅయిన కైకసి తన కుమారుడు దశాగ్రీవుని కడకు వచ్చి "కుమారా! నీ సోదరుడైన ఈ కుబేరుని చూడుము దివ్యమైన అతని తేజో వైభవమును చూడుము , నీవు కూడా నీ అన్న వలె తెజోవైభవమూర్తివగుటకు ప్రయత్నించుము " అన్నది . తల్లి మాటలు విన్నంతనే దశగ్రీవుడు " అమ్మా ! ఇదే నా ప్రతిజ్ఞ నేనుకూడా తపస్సు  చేసి ఇంతకంటే మించిన వాడను కాగలను " అన్నాడు  . వెంటనే తపస్సు చేసుకొనుటకు తమ్ముల తో కలసి గోకర్నాశ్రమము చేరు కొన్నాడు .
దశగ్రీవుడు సోదరులతో కలసి తీవ్రమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని మెప్పించాడు . బ్రహ్మ ఎమివరము కావాలని అడిగాడు . అందులకు దశగ్రీవుడు మృత్యువు లేకుండా వరముని ప్రసాదించు అన్నాడు . బ్రహ్మ అందులకు పూర్తీ అమరత్వము ప్రాప్తిచుట అసాధ్యము ఇంకేదైనా వరం కోరుకో అన్నాడు . అందులకు దశగ్రీవుడు " నాకు గరుడ జాతివారు , నాగులు, యక్షులు, దైత్యులు దానవులు , రాక్షసులు మరియు దేవతల  వలన మృత్యువు లేకుండా వరము  ప్రసాదించు, మనుష్యుల వంటి ఇతర ప్రాణుల వలన నాకు భయము లేదు వారు నాకు గడ్డి పోచతో సమానము " అన్నాడు బ్రహ్మ అతడు అడిగిన వరాన్ని ప్రసాదించి ,ఇంకా మనస్సు లో తలచినన్తనె  ఇష్టమైన రూపము ధరించే వరాన్ని కూడా ప్రసాదించాదు. తదుపరి బ్రహ్మ విభీషనుడిని ఇష్టమైన వరం కోరుకోమన్నాడు . అందుకు విభీషణుడు తనకు బ్రహ్మాస్త్రము కావాలని  మరియు తన బుద్ది ఎల్లప్పుడూ పూర్తిగా ధర్మ బద్దమై ఉండాలని కోరుకొన్నాడు. అందుకు బ్రహ్మ చాల సంతసించి నీవు కోరినట్లే జరుగును నీకు అమరత్వము కూడా ప్రాప్తించును అని చెప్పాడు.( ఈ విధంగా విభీషణుడు చిరంజీవి అయ్యాడు .) 
తరువాత కుంభకర్నునికి వరములు  ఇచ్చుటకు బ్రహ్మ సిధపడ్డాడు . అంతలో దేవతలు అందరూ వచ్చి " స్వామి ఇప్పుడే కుంభకర్నునికి వరములు ఇచ్చుట యుక్తము కాదు ఇతడు  లోకాలను ఎంతగా గడ గడ  లాడించు చున్నాడో మీకు తెలుసు ,ఇతడు  ఎంతో మంది అప్సరసలని, ఇంద్రుని అనుచరుల్ని ఋషులని  బక్షించాడు , ఇతనికి వరములు వరములు ఇచ్చిన ముల్లోకాలని తినివేయగలడు " అని ప్రార్ధించారు . అంతట  బ్రహ్మ సరస్వతీ దేవిని స్మరించి, దేవి నీవు దేవతల  ప్రార్ధనను మన్నించి కుంభకర్ణుని నోటి యందు ప్రవేసింపుము  అని పలికెను. తరువాత బ్రహ్మ కుంభకర్ణుని తో నీ అభీష్టానుసారము ఒక కోరిక కోరుకొనుము అనెను. అంతట  కుంభకర్ణుడు " దేవదేవా నేను పెక్కు సంవత్సరములు నిద్రించు నట్లు వరము ప్రసాదింపుము" అనెను . బ్రహ్మ తథ్థాస్తు అని అంతర్దానుడు అయ్యెను . సరస్వతి దేవి కూడా అతనిని వదలి వెళ్లి పోయెను .. ఇట్లు ఆ ముగ్గురు సోదరులు వరములు  పొంది మిక్కిలి బల  సంపన్నులై  "శ్లేష్మాతకము" అను పేరు గల తమ తండ్రి వనమునకు వచ్చి అచట సుఖము గా నివసింప సాగిరి.                         

No comments:

Post a Comment